నెగెటివ్ క్యారెక్టర్ లో నటించడంపై రాశి స్పందన
- 'నిజం' సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించిన రాశి
- ఆ రోల్ అంత నెగెటివ్‌గా మారుతుందని తాను అస్సలు ఊహించలేదని వ్యాఖ్య
- ఇకపై తన పాత్రల విషయంలో జాగ్రత్తగా ఉంటానన్న రాశి
ఒకప్పుడు తెలుగు తెరపై వెలిగిపోయిన హీరోయిన్ రాశి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్నారు. తిరువీర్ హీరోగా నటించిన ‘పాపం ప్రతాప్’ సినిమా నిన్న (శుక్రవారం) విడుదలై మంచి ఆదరణ పొందుతున్న తరుణంలో, ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో రాశి తన సినీ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘నిజం’ సినిమాలో తాను చేసిన నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర గురించి ప్రస్తావిస్తూ.. "ఆ రోల్ అంత నెగెటివ్‌గా మారుతుందని నేను అస్సలు ఊహించలేదు" అని పేర్కొన్నారు. కేవలం ఒక నటిగా అన్ని రకాల షేడ్స్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ సినిమాలో నటించానని చెప్పారు.
ఇకపై తాను చేసే పాత్రల విషయంలో చాలా స్పష్టంగా ఉంటానని రాశి తెలిపారు. "'పాపం ప్రతాప్' దర్శకుడు నా కోసమే ఈ పాత్ర రాశానని చెప్పారు. పాత్రలో దమ్ముండి, అది ప్రేక్షకులకు నచ్చుతుంది అనుకుంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. అది పాజిటివా, నెగెటివా అన్నది నాకు ముఖ్యం కాదు" అని ఆమె వివరించారు. గోపీచంద్ విలన్‌గా మెరిసిన 'నిజం'లో రాశి చేసిన బోల్డ్, నెగెటివ్ పాత్ర అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆమె ఒక మంచి హిట్ మూవీతో ప్రేక్షకులను పలకరించడం విశేషం.